మోపిదేవి దేవస్థానం మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతూ భక్తులచే విశేష పూజలు అందుకుంటున్న మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం షష్టి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు గారు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ -విజయలక్ష్మి దంపతులు విచ్చేశారు. వారికి దేవస్థానం వేద పండితులు ఘన స్వాగతం పలికారు. బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణి కుమార్ శర్మ గారు, ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ , ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ ముఖ్య అర్చక బుద్దు సతీష్ శర్మ పలువురు పండితుల వేద మంత్రాల నడుమ బుద్ధప్రసాద్ - విజయలక్ష్మి దంపతులు, దాసరి శ్రీరామ వరప్రసాదరావులు స్వామి వారి పుట్టలో పాలు పోసి, పట్టు వస్త్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
షష్టి కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలను మూడు రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల - 2026 క్యాలెండరు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దిన దిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న మోపిదేవి పుణ్యక్షేత్రమునకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం ఎదుట నిర్మిస్తున్న వసతి గదులు, షాపింగ్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం నూతనంగా కేశ ఖండనశాల, టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావు గారు, దేవస్థానం అధికారులు కేశవ గారు, కిషోర్, పయ్యావుల నాగరాజు గారు, సీఐ కే.ఈశ్వరరావు గారు, ఎస్ఐ పీ.గౌతమ్ కుమార్ గారు, సిబ్బంది పాల్గొన్నారు.