శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    విమాన వేంకటేశ్వరుడు – మోక్ష మార్గానికి దివ్య ద్వారం

    20 hours ago

    వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో తిరుమల పర్వతం భక్తుల హృదయాల్లో భక్తి జ్యోతి వెలిగిస్తోంది. ఆ దివ్య క్షేత్రంలో ఆనంద నిలయ విమానం మీద వేంచేసి ఉన్న విమాన వేంకటేశ్వరస్వామి దర్శనం భక్తులకు అపూర్వమైన అనుభూతిని ప్రసాదిస్తుంది. వెండి మకరతోరణాలతో అలంకరింపబడిన చిన్న మందిరంలో, గర్భాలయంలోని మూలమూర్తిని పోలిన రూపంతో స్వామి దర్శనమిస్తుంటే, ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడు సేవ చేస్తూ నిలిచిన దృశ్యం భక్తుల మనసును పరవశింపజేస్తుంది.

     

    ఆనంద నిలయ విమానంపై వేంచేసి ఉన్న కారణంగా ఆయనను విమాన వేంకటేశ్వరుడు అని పిలుస్తారు. ఈ సన్నిధిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని వేంకటాచల మహాత్మ్యం చెబుతోంది. గర్భాలయంలో స్వయంభువుగా వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి మూలవిరాట దర్శనంతో సమానమైన ఫలితాన్ని ఈ విమాన వేంకటేశ్వరస్వామి దర్శనం ఇస్తుందనే గాఢ విశ్వాసం భక్తుల్లో చిరకాలంగా నిలిచింది. అందుకే మూలమూర్తి దర్శనం కుదరకపోయినా, ఈ విమాన స్వామిని దర్శిస్తే యాత్ర సంపూర్ణమవుతుందని అంటారు.

    పూర్వకాలంలో భక్తులు ముందుగా విమాన ప్రదక్షిణ చేస్తూ విమాన వేంకటేశ్వరస్వామివారిని దర్శించిన తరువాతే ఆనంద నిలయంలోకి ప్రవేశించేవారు. కాలప్రవాహంలో భక్తుల రద్దీ పెరిగినప్పటికీ, ఈ సన్నిధి ప్రాధాన్యం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. నేటికీ భక్తులు ప్రదక్షిణ మార్గంలో నడుస్తూ ఈ స్వామి దర్శనాన్ని ఒక దివ్య ఘట్టంగా భావిస్తారు.

    విమాన వేంకటేశ్వరస్వామి దర్శనంతో పాపాలు తొలగి, శుభఫలాలు కలుగుతాయని శాస్త్రోక్త నమ్మకం. ముఖ్యంగా శ్రీ వ్యాసతీర్థుల కాలం నుండి ఈ సన్నిధికి విశేష గౌరవం లభించింది. ద్వైత పీఠ సంప్రదాయ ప్రవర్ధకులైన శ్రీ వ్యాసతీర్థులు, శ్రీకృష్ణదేవరాయలవారి గురువుగా ప్రసిద్ధి చెందారు. కుహూ యోగమనే కాలసర్ప దోష నివారణార్థం వ్యాసతీర్థులు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించారని పురాణ గాథలు చెబుతాయి. అందువల్లే ఆయన వ్యాసరాయలు అనే బిరుదుతో లోక ప్రసిద్ధి పొందారు.

    వ్యాసరాయలు సుమారు పన్నెండు సంవత్సరాలపాటు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చనాధికములు నిర్వహించారు. ఆ కాలంలో విమాన వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పారాయణలు, దర్శనాలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ సంప్రదాయం ఈనాటికీ కొనసాగుతూ, ఆలయ ఆచారాలలో శాశ్వత స్థానాన్ని పొందింది. భక్తులే కాదు, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు కూడా ఆలయం వెలుపలికి వెళ్లే ముందు విమాన ప్రదక్షిణ చేసి, విమాన వేంకటేశ్వరస్వామి సన్నిధిలో క్షణకాలం నిలబడి హారతులు స్వీకరిస్తారు. ఇది ఈ సన్నిధి మహిమకు మరొక నిదర్శనం.

     

    ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు జరిగే పవిత్రోత్సవంలో విమాన వేంకటేశ్వరస్వామివారికీ పవిత్ర మాలలు సమర్పించబడతాయి. అర్చక స్వాములు నిచ్చెనల ద్వారా సన్నిధికి చేరుకొని ఆ మాలలను సమర్పించే దృశ్యం భక్తుల హృదయాలను భక్తితో నింపుతుంది. అంతేకాదు, ప్రతిరోజూ ఆనంద నిలయంలో జరిగే మూడు పూటల నివేదన సమయంలో ఆలయం లోపల నుండే ఈ విమాన స్వామికి నివేదనలు అర్పించబడతాయి.

     

    గర్భాలయంలో వేంచేసి ఉన్న స్వామి భక్తుల కోరికలను తీర్చే కరుణామూర్తి కాగా, విమాన వేంకటేశ్వరస్వామి మోక్ష ప్రదాతగా భక్తులు భావిస్తారు. అందుకే ప్రదక్షిణ మార్గంలో ఈ స్వామి దర్శనం తప్పనిసరిగా చేయవలసినదిగా చెబుతారు. గర్భాలయంలో ఎక్కువసేపు నిలబడే అవకాశం లేకపోయినా, విమాన వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తులు ప్రశాంతంగా నిలబడి తమ మనసులోని బాధలను, కోరికలను స్వామికి సమర్పించుకుంటారు. అలా విమాన వేంకటేశ్వరస్వామి దర్శనం భక్తికి పరాకాష్ఠగా, మోక్ష మార్గానికి ద్వారంగా నిలుస్తుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    MI vs DC: Harmanpreet seeks comeback; Rodrigues to lead Delhi
    తర్వాత ఆర్టికల్
    MI vs DC: New Delhi skipper Jemimah wins toss, opts to bowl against Mumbai

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి