కెనడా పౌరసత్వ చట్టంలో కీలక మార్పులు చేపట్టింది. కోర్టు తీర్పు నేపథ్యంలో పౌరసత్వ బదిలీపై ఉన్న పరిమితులను తొలగిస్తూ బిల్ సీ–3 పేరిట కొత్త చట్టాన్ని రూపొందించింది. విదేశాల్లో పుట్టిన లేదా దత్తత తీసుకున్న చిన్నారుల పౌరసత్వ సమస్యలు ఇకపై సులభంగా పరిష్కారమవుతాయని వలసల శాఖ మంత్రి లీనా డయాబ్ తెలిపారు. 2009లో అమల్లోకి వచ్చిన పాత చట్టం ప్రకారం, విదేశాల్లో పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు కెనడాలో జన్మించి ఉండాలి లేదా అక్కడే నివసించి పౌరసత్వం పొందినవారై ఉండాలి. దీంతో, ఇద్దరూ విదేశాల్లో పుట్టి కెనడా పౌరులుగా మారిన తల్లిదండ్రులు తమ సంతానానికి పౌరసత్వాన్ని బదిలీ చేయలేని పరిస్థితి ఏర్పడేది. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని ఒంటారియో సుపీరియర్ కోర్టు 2023లో తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం చట్ట సవరణలు చేసింది.
కొత్త చట్టం ప్రకారం, విదేశాల్లో పుట్టిన కెనడా పౌరులూ తమ పిల్లలకు పౌరసత్వం బదిలీ చేసే హక్కు పొందుతారు. దీనికి వారు బిడ్డ పుట్టే ముందు కనీసం 1075 రోజుల పాటు కెనడాలో నివసించి ఉండాలి. ఇదే నిబంధన దత్తత పిల్లలపైనా వర్తిస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ విధానాలను అనుసరించి తీసుకొచ్చిన ఈ చట్టం అమల్లోకి వస్తే, ప్రత్యేకించి భారత సంతతి కెనేడియన్లకు విశేషంగా ప్రయోజనం కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.