హైదరాబాద్, నవంబర్ 23, 2025:
నగర భద్రతను మరింత బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థ పనితీరును పరిశీలించాలని లక్ష్యంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం అర్థరాత్రి ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఎలాంటి బందోబస్తు లేకుండా, సైరన్ లేకుండా సాధారణ పెట్రోలింగ్ వాహనంలోనే స్వయంగా పర్యటించడం నగరంలో చర్చనీయాంశమైంది.
రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లిన సీపీ
సీపీ మొదట లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిమితిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీలలో ఉన్న రౌడీ షీటర్ల ఇళ్లకు అర్ధరాత్రి నేరుగా వెళ్లారు. ఇంటి వద్దే నిద్రలో ఉన్న రౌడీలను సజ్జనార్ నిద్రలేపి వారి: నేర చరిత్ర, ప్రస్తుత జీవన విధానం, ఉపాధి పరిస్థితులు, సామాజిక ప్రవర్తనలు పై వివరాలను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, మంచి మార్గంలో సాగాలని వారిని హితవు పలికారు.
పీపుల్ వెల్ఫేర్ పోలిసింగ్‌లో భాగమైన కీలక చర్య
ఈ ఆకస్మిక పర్యటన, రౌడీ షీటర్లలో మార్పు తీసుకురావడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి చేపడుతున్న పీపుల్ వెల్ఫేర్ పోలిసింగ్లో అత్యంత ప్రభావవంతమైన దశగా నిలిచింది.
రాత్రి 12 నుంచి ఉదయం 3 వరకూ సుదీర్ఘ పర్యటన
సౌత్ వెస్ట్ జోన్‌లో జరిగిన ఈ పర్యటనలో సీపీ: లంగర్ హౌస్, టోలిచౌకి, పోలిస్ స్టేషన్ల పరిధిలోని సున్నితమైన ప్రాంతాలు, ముఖ్య రహదారులను పరిశీలించారు. టోలిచౌకి ప్రాంతంలో రాత్రిపూట తెరచి ఉన్న హోటళ్లు, షాపులు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.
విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తతపై సమీక్ష
గస్తీలో ఉన్న కానిస్టేబుళ్లను, అధికారులను కలిసి:
వారు ఎంత అప్రమత్తంగా ఉన్నారు? ప్రజల భద్రత కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారు? స్పందన వేగం ఎలా ఉంది? గస్తీ పాయింట్ల మానిటరింగ్ ఎలా జరుగుతోంది? అన్న అంశాలపై సీపీ ప్రత్యక్షంగా ఆరా తీశారు. తరువాత టోలిచౌకి పోలీస్ స్టేషన్ సందర్శించిన సజ్జనార్ స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి ఎంట్రీలు, హాజరు రిజిస్టర్, డ్యూటీ అలాట్మెంట్లు, సమగ్రంగా పరిశీలించారు.
సజ్జనార్ సందేశం: ప్రజల భద్రతే ప్రాధాన్యం
సీపీ సజ్జనార్ మాట్లాడుతూ:
రాత్రివేళల్లో పోలిసింగ్‌ను బలోపేతం చేస్తామని, ఆకస్మిక పర్యటనల ద్వారా సిబ్బంది బాధ్యతా భావం పెరుగుతుందని, నగరంలో నేరాలపై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించే విధంగా ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.