హైదరాబాద్: పేదల గృహావసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించి పంపిణీ చేసిన డబుల్ బెడ్‌రూం (2BHK) ఇళ్ల దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించింది. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను అమ్మడం, అద్దెకు ఇవ్వడం వంటి అక్రమ కార్యకలాపాల్లో కొంతమంది లబ్ధిదారులు పాల్గొంటున్నట్లు బయటపడటంతో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఎండీ గౌతమ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన 2BHK ఇళ్లను అమ్మినట్లయితే లేదా అద్దెకు ఇచ్చినట్లయితే సంబంధిత లబ్ధిదారులపై Prohibition of Transfer (POT) చట్టం ప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదవుతాయని స్పష్టం చేశారు. అంతేకాదు, ఇలాంటి ఇళ్లను ప్రభుత్వం ఎటువంటి పరిహారం లేకుండా వెంటనే స్వాధీనం చేసుకుంటుంది అని పేర్కొన్నారు.
అద్దెకు ఇవ్వడమే కూడా చట్టవిరుద్ధం
డబుల్ బెడ్‌రూం ఇళ్లను అమ్మడం మాత్రమే కాదు, వాటిని అద్దెకు ఇవ్వడమే కూడా చట్టవిరుద్ధమని ఎండీ గౌతమ్ తెలిపారు. తనిఖీల్లో ఎవరి వద్దైనా అద్దెకు ఇచ్చిన ఆధారాలు లభిస్తే, ఇంటి కేటాయింపును తక్షణమే రద్దు చేస్తామని అధికారులు తెలిపారు.. ఈ ఇళ్లు పేదల నివాస అవసరాల కోసం మాత్రమే కేటాయించబడినవనీ, వాటిని వ్యాపార సాధనంగా ఉపయోగించే హక్కు లబ్ధిదారులకు లేదని వారు హెచ్చరించారు.
GHMC పరిధిలో సర్వే పూర్తి – షాకింగ్ వివరాలు వెలుగులోకి
ఇళ్ల అమ్మకాలు, అద్దెలపై అధికారులు GHMC పరిధిలో ఇప్పటికే సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కొల్లూరు, రాంపల్లి వంటి ప్రాంతాల్లో ఉచితంగా ఇచ్చిన ఇళ్లను కొందరు లబ్ధిదారులు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రహస్యంగా విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ రకమైన ఉల్లంఘనలు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ‘ప్రతి పేదవాడికి సొంత ఇల్లు’ అనే సంకల్పాన్ని దెబ్బతీయడమే కాక, నిజమైన పేద లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లాల్లో కూడా సర్వేలు – కఠిన చర్యలు త్వరలోనే
GHMC తర్వాత ఇప్పుడు ఈ సర్వేలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించడానికి హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. అక్రమ అమ్మకాలు, అద్దెలపై ఇప్పటికే కేసులు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలోనే విస్తృతమైన చర్యలు తీసుకోబడతాయని అధికారులు తెలిపారు.