తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హడ్కో (HUDCO) చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠతో సమావేశమై, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పలు మెగా ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్), రేడియల్ రోడ్లు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీరేటుతో రుణాలు రాష్ట్రానికి అత్యవసరమని సీఎం తెలిపారు.
గత ప్రభుత్వ కాలంలో ఎక్కువ వడ్డీ రేట్లతో తీసుకున్న రుణాల వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారo పడిందని, ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి లోన్ రీకన్‌స్ట్రక్షన్ అవసరమని ఆయన వివరించారు. ఈ సూచనలపై హడ్కో చైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
గ్రీన్ ఫీల్డ్ కారిడార్, బుల్లెట్ ట్రైన్ పై ప్రాముఖ్య చర్చ
సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ కనెక్టివిటీకి కీలకమైన పలు ప్రాజెక్టులను ఈ సమావేశంలో ప్రస్తావించారు. వాటిలో— భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు – అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ కారిడార్, బందరు పోర్ట్‌కు గ్రీన్‌ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముఖ్యంగా నిలిచాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు హడ్కో మరింత అనుకూల సహకారం అందిస్తుందని చైర్మన్ సంకేతాలిచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రుణాలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే హడ్కో రుణాలు ఆమోదించినట్లు చైర్మన్ తెలిపారు. అయితే, ఇంకా 10 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన రుణాలను కూడా త్వరితగతిన మంజూరు చేయాలని సీఎం కోరడంతో, దీనిపై కూడా చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న భారత్ గ్లోబల్ సమ్మిట్‌కు చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.