అయోధ్య, నవంబరు 25: అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు మంగళవారం పూర్తికానున్నాయి. ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ఈ ధ్వజారోహణ కార్యక్రమం గురించి ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజం ఆకారంలో రూపొందించిన ఈ పవిత్ర కాషాయ ధ్వజంలో మధ్యభాగంలో రాముని వీర్యశౌర్యాలకు ప్రతీకగా సూర్యుని బొమ్మ, ‘ఓం’ చిహ్నం, కోవిదార వృక్షం చిత్రాలు ఉంటాయి. ఈ ధ్వజం భారతీయ సంస్కృతి, ఐక్యత, ప్రతిష్ఠ మరియు రామరాజ్య స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయం శిఖరాన్ని ఉత్తర భారత సంప్రదాయ ‘నగర’ శైలిలో నిర్మించగా, 800 మీటర్ల చుట్టుకొలత కలిగిన ప్రాకారాన్ని దక్షిణాది శైలిలో నిర్మించడం విశేషం.
ఈ సందర్బంగా ప్రధాని మోదీ రామ మందిర ప్రాంగణంలోని ఇతర ఆలయాలు—మహర్షి వశిష్ఠ, విశ్వామిత్ర, వాల్మీకి, అగస్థ్య, దేవీ అహల్య, మాతా శబరి, నిషాద్‌రాజు గుహుని మందిరాలు—ను దర్శించనున్నారు. అనంతరం శేషావతార్ మందిరంలో, మాతా అన్నపూర్ణ మరియు రామదర్బార్ గర్భగృహాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చివరగా రామలల్లా గర్భగృహ దర్శనం అనంతరం ప్రధాన ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వాల్మీకి రామాయణ ఘట్టాలను ఆలయ గోడలపై చెక్కిన 87 శిల్పాలు, దేశ సంస్కృతిని ప్రతిబింబించే 79 కాంస్య రేకులు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. మార్గశిర మాస శుక్ల పక్ష పంచమి నాడు, అభిజిత్ లగ్నంలో ధ్వజారోహణ జరగడం ప్రత్యేకతగా నిలిచింది. ఇదే లగ్నంలో సీతారాముల కల్యాణం జరిగినట్లు పురాణాలు చెబుతాయి. సిక్కు గురువు గురు తేగ్ బహాదూర్ అమరవీరత్వ దినం కూడా ఇదే రోజు కావడం విశేషం. ప్రధాని పర్యటనకు సంబంధించి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం వాటిని సమీక్షించారు.