ఇంటర్నెట్ డెస్క్ నవంబర్ 25 :
ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హేలి గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 12 వేల ఏళ్ల తరువాత ఆదివారం భారీగా విస్ఫోటనం చెందిన విషయం తెలిసిందే. ఈ విస్ఫోటనం కారణంగా అక్కడ స్వల్ప భూకంపం కూడా సంభవించింది. అగ్నిపర్వతం ఊదిన దట్టమైన పొగ, బూడిద 15 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడింది.
భారత్ వైపు సాగే బూడిద మేఘాలు
ఈ బూడిద మేఘాలు పశ్చిమ గాలుల దిశలో ప్రయాణించి భారత ఉపఖండం వైపు ప్రవేశించాయి. మొదటగా గుజరాత్ గగనతలం చేరి అనంతరం రాజస్థాన్, ఢిల్లీ వైపు ప్రయాణించాయి. వేల అడుగుల ఎత్తులో సాగుతున్న ఈ మేఘాలు విమాన రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
డీజీసీఏ జాగ్రత్త సూచనలు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇప్పటికే అన్ని విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. సూచనలు ఇలా ఉన్నాయి. బూడిద మేఘాలు ఉన్న ప్రాంతాల్లో విమాన మార్గాలను మార్చుకోవాలి , దుమ్ము/బూడిద మేఘాలు ఎదురైతే వెంటనే DGCAకు సమాచారం ఇవ్వాలి. ఇంజిన్ పనితీరులో మార్పులు, కేబిన్‌లో పొగ లేదా దుర్వాసన కనిపించిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ పరిస్థితుల వల్ల ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థల సర్వీసులకు స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి.
సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువ: నిపుణుల హెచ్చరిక
వాతావరణ శాస్త్ర నిపుణుల ప్రకారం, ఈ బూడిద మేఘాల్లో సల్ఫర్ డయాక్సైడ్ (SO₂) అధికంగా ఉండటం ఆకాశంలో బూడిదకణాల పరిమాణాన్ని పెంచుతోంది. అయితే మేఘాలు అత్యంత ఎత్తులో ప్రయాణిస్తున్నందున ఢిల్లీలో వాయు నాణ్యతపై ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
నేపాల్, ఉత్తరాఖండ్‌కి అపాయం
మేఘాలు హిమాలయ శ్రేణుల దరిదాపులకు చేరుకున్నప్పుడు కొండలను తాకి నేల దగ్గరికి దిగే అవకాశం ఉన్నందున నేపాల్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో వాయు నాణ్యత తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.